ఐసిసి కంటే ఏ జట్టు గొప్పది కాదు.. ఆ రెండు జట్లకు జై షా చురకలు

ముంబై: టి-20 ప్రపంచకప్ 2026కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో తమకు భద్రత లేదని.. ఇతర కారణాలు చెబుతూ బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసిసిని కోరింది. అయితే ఇందుకు ఐసిసి అంగీకరించకపోవడంతో.. టోర్నీ నుంచి వైదొలగింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తూ పాక్ కూడా రభస చేసింది. చివరికి ఆర్థికపరమైన ఇబ్బందులను కొనితెచ్చుకోవడం ఎందుకని పాకిస్థాన్ టోర్నీలో పాల్గొంది. సూపర్-8 దశలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ రెండు జట్లకు తాజాగా ఐసిసి ఛైర్మన్ జై షా చురకలు అంటించారు.

ముంబైలో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ జట్టు కూడా ఐసిసి కంటే గొప్పది కాదని పేర్కొన్నారు. ‘‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసిసి ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగా టోర్నీని నిర్వహించాం. ఐసిసి ఛైర్మన్‌గా నేను ఒకే మాట చెబుతున్నా.. ఐసిసి కంటే కూడా ఏ జట్టు గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. అన్ని జట్ల సమూహంతోనే ఆర్గనైజేషన్ రూపొందింది’’ అని జై షా అన్నారు.

Scroll to Top